నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 15 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారు అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ASCE) వారి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శిరీష బండపల్లి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, పలమనేరు మున్సిపాలిటీ పాల్గొన్నారు. ముందుగా ముఖ్య అతిథిలు, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్,డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సనత్ హెగ్డే మరియు తదితరులు మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో శిరీష బండపల్లి మాట్లాడుతూ భారత్‌లో అత్యంత గొప్ప ఇంజనీర్ అయిన భారత రత్న సర్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి రోజు అయిన సెప్టెంబరు 15 ని దేశవ్యాప్తంగా 'ఇంజినీర్స్ డే' గా జరుపుకోవడం గర్వకారణం అని అన్నారు. ఇంజినీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించినవారిలో భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ మన మోక్ష గుండం విశ్వేశ్వరయ్య అని, ఇంజినీర్‌గా మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారు అని అన్నారు. ఇంజనీరింగ్ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు అని అన్నారు. సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు కేవలం ఉద్యోగం పొందడమే లక్ష్యంగా కాకుండా, తమ సాంకేతిక పరిజ్ఞానంతో సమాజంలోని సమస్యలకు సానుకూల మార్పు తీసుకురావడంపై దృష్టి సారించాలని అన్నారు. పర్యావరణ ఇంజినీరింగ్ ద్వారా వ్యర్థాలను సంపదగా మార్చే మార్గాలను అన్వేషించవచ్చని, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్ ద్వారా ట్రాఫిక్ సమస్యలకు మెరుగైన పరిష్కారాలను అందించవచ్చని అన్నారు. అర్బన్ ప్లానింగ్ ద్వారా పార్కులు, రహదారులు, నీటి వనరులు, ఇతర ప్రజా సౌకర్యాలను సమర్థవంతంగా ప్రణాళిక చేసి మెరుగైన నగరాలను అబివృద్ధి చేయడంలో సివిల్ ఇంజినీర్ల పాత్ర ముఖ్యమైనదని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ నిర్మాణాల భద్రత, స్థిరత్వం, నిర్మాణ సామర్థ్యం, స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ వంటి కీలక అంశాల్లో సివిల్ ఇంజినీర్ల నైపుణ్యం ఎప్పటికీ అవసరమేనని అన్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో కోర్ రంగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, రైల్వేలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మున్సిపల్ పరిపాలన, నీటి వనరులు, రవాణా, పట్టణ ప్రణాళిక, పర్యావరణం, రక్షణ రంగం, పరిశ్రమలు, పరిశోధన, ఉన్నత విద్య వంటి విభిన్న రంగాల్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడం ద్వారా సివిల్ ఇంజినీర్లు సమాజ అభివృద్ధికి గణనీయమైన సేవలు అందించగలరని, విద్యార్థులు “ఏ ఉద్యోగం వస్తుంది?” అనే ఆలోచనకు బదులుగా “సమాజంలో నేను ఎలాంటి మార్పు తీసుకురాగలను?” అనే దృక్పథంతో తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ విజయకుమార్ నటేశన్, కోఆర్డినేటర్ డాక్టర్ సుధీర్ కుమార్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News