నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోరప్రమాదం హృదయ విదారకం - మృతుల కుటుంబాలకు రూ.కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి - మదనపల్లె వైకాపా సమన్వయకర్త నిస్సార్ అమ్మద్ డిమాండ్ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోరప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం పట్ల మదనపల్లె వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మంగళవారం మదనపల్లె అవెన్యూ రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి,మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్.రెడ్డితోకలిసి మాట్లాడారు.నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ షాప్-2 (ఎస్.ఎం.ఎస్ -2)లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడటం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.ప్రమాదంలో గాయపడిన కార్మికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించి,వారి ప్రాణాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడం బాధకరమని వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి,గాయపడిన వారికి రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేవలం రూ.25 లక్షలు పరిహారం ప్రకటించడాన్ని తప్పు పట్టారు.జగన్మోహన్ రెడ్డి సిఎంగా వున్న సమయంలో పాలిమర్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే రూ.కోటి పరిహారం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని,భద్రతా ప్రమాణాల అమలులో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం ప్రయివేటుపరం చేయాలని చూస్తూ తీవ్ర వ్యతిరేకత రావడంతో అరకొర సిబ్బందితో స్టీల్ ప్లాంట్ నడుపుతోందన్నారు.ఉన్న సిబ్బంది అదనపు పని భారంతో తీవ్ర ఆందోళన మధ్య పనిచేస్తున్నారని ఆరోపించారు.సిబ్బందిని పెంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు పూర్వవైభవాన్ని తీసుకురావాలని సూచించారు.భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని సూచించారు.
Reporter
Namitha News