నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 24 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం వారు ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ వారి ఆధ్వర్యంలో "ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ యాజ్ కెరీర్ అప్పార్చునిటీస్" అనే అంశంపై అవగాహన వర్కుషాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేటర్ విశాల్ విజయ్ నాయర్, వాధ్వాని ఫౌండేషన్, బెంగళూరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, కొత్త ఆలోచనలను వ్యాపార అవకాశాలుగా మార్చి పరిశ్రమలను అభివృద్ధి చేసే పారిశ్రామిక వేత్తలుగా ఎదగడం అత్యంత అవసరం అని అన్నారు. సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణాత్మక దృక్పథం, రిస్క్ తీసుకునే ధైర్యం మరియు సరైన ప్రణాళిక ద్వారా యువత దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించగలదని సూచించారు. ఒక ఆలోచనను విజయవంతమైన ఉత్పత్తి లేదా సేవగా మార్చే ప్రక్రియలో దృష్టి, వ్యూహం, పట్టుదల, పరిశ్రమలతో కోలాబరేషన్ వంటి అంశాలు అత్యంత ముఖ్యమని వివరించారు. అలాగే పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న NBMSME, KVIC, NSIC, NSIEDB వంటి పథకాల ద్వారా స్టార్ట్-అప్‌లు, ఇన్నోవేషన్ ప్రాజెక్టులు, మరియు యువ పారిశ్రామిక వేత్తలకు అవసరమైన ఆర్థిక సహాయం, మెంటరింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ సపోర్ట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులలో ఉన్న ఆలోచనలను వాస్తవికతగా మార్చి కొత్త స్టార్ట్-అప్‌లుగా అభివృద్ధి చేయడమే భవిష్యత్తులో అత్యుత్తమ కెరీర్ అవకాశమని, ఈ ప్రయాణం సమాజ అభివృద్ధి మరియు దేశ పురోగతికి దోహదం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో డీన్ -అకాడెమిక్స్ డాక్టర్ రామ కే కొమరగిరి, విభాగాధిపతి డాక్టర్ ఎస్.భాస్కరన్, ఈ.డి సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ కే.శిరీష, కోఆర్డినేటర్స్ డాక్టర్ బి.ప్రవీణ్ కుమార్, పి.మొహమ్మద్ రిజవాన్ అలీ, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News