నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రౌడీషీటర్లకు డీఎస్పీ పావని స్ట్రాంగ్ వార్నింగ్ సత్ప్రవర్తనతో జీవించండి.. లేదంటే పీడీ యాక్ట్ తప్పదన్న హెచ్చరిక సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మదనపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ బి. పావని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో రౌడీషీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు భారీ స్థాయిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన దాదాపు 200 మంది రౌడీషీటర్లు కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ పావని మాట్లాడుతూ పాత నేరప్రవృత్తికి పూర్తిగా స్వస్తి పలికి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని సూచించారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవనం సాగించాలని తెలిపారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రౌడీయిజం, భూదందాలు, బెదిరింపులు లేదా సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రౌడీషీటర్ల కదలికలపై స్థానిక పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, మళ్లీ నేరాల బాట పట్టిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. జిల్లా పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తోందని, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని డీఎస్పీ తేల్చిచెప్పారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News