నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య సేవా సంస్థలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు - హాజరైన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపి ఆనందన్ మదనపల్లె : పట్టణంలోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.పి ఆనందన్,అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జి.సుబ్రహ్మణ్యం,జనరల్ సెక్రటరీ ఎ.కవితా రాణి,కోశాధికారి పట్నం గిరిజమ్మాళ్,విశ్రాంత ఉపాధ్యాయులు ఎం.రామకృష్ణయ్య,ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉపాధ్యాయులు,బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.ఇందులో భాగంగా భారతదేశ మాజీ రాష్ట్రపతి,గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి,జ్యోతి ప్రజ్వలన చేసి ఘన నివాళులర్పించారు.అనంతరం విద్యార్థులు ఉపన్యాసాలు,సూక్తులు,పాటలు,నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకుని గురువుల పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు.అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నేటి తరానికి ఉపాధ్యాయులు పట్టుకొమ్మల వంటివారు.విలువలతో కూడిన విద్యను అందిస్తూ,పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చే మహోన్నత బాధ్యత ఉపాధ్యాయులది.సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అపారమైందని పేర్కొన్నారు.జనరల్ సెక్రటరీ ఎ.కవితా రాణి మాట్లాడుతూ గురు అనుగ్రహం,ఉపాధ్యాయుల ఆశీస్సులు ఉంటేనే విద్యార్థులు బంగారు భవిష్యత్తును నిర్మించుకోగలరు.అజ్ఞానం అనే చీకటి నుండి విజ్ఞానం అనే వెలుగులోకి నడిపించే వారు గురువులు.అందుకే గురువులకు శతకోటి వందనాలని తెలిపారు.అలాగే విద్యార్థులు తమ గురువులను గౌరవించి వారి బాటలో నడవాలని సూచించారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులందరినీ ఘనంగా సన్మానించి జ్ఞాపికలు,కానుకలు అందజేశారు.బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తరఫున ఉత్తమ ఉపాధ్యాయురాలిగా శ్రీమతి సి.ఆర్.రెడ్డి ప్రసన్నని ప్రశంసా పత్రం మరియు సన్మానంతో ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో బి.జనార్ధన్,సి.ఆర్ రెడ్డి ప్రసన్న,ఈ.భార్గవి,ఎస్.భారతి,డి.నేత్రావతి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.చివరగా ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ సమాజ నిర్మాణంలో వారి పాత్ర చిరస్మరణీయమని పేర్కొంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.
Reporter
Namitha News