నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - సెప్టెంబర్ 03: జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ, నివారణపై అవగాహన కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వేంపల్లి భాస్కర్ తెలిపారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి డాక్టర్ ఎల్. రాధిక ఆదేశాల మేరకు దిశా ఆధ్వర్యంలో ఐసీటీసీ కౌన్సిలర్లు, ఏఆర్టీ, ఎన్‌జీవో ప్రతినిధులతో స్థానిక డీహెచ్‌ఓ కార్యాలయంలో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేంపల్లి భాస్కర్ మాట్లాడుతూ ఏఆర్టీ, ఐసీటీసీ, ఎన్‌జీవోలకు నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని సూచించారు. లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు
గత నెల 12వ తేదీ నుంచి జిల్లాలోని మార్కెట్లు, పాఠశాలలు, కళాశాలలు, అధిక ప్రమాద ప్రాంత గ్రామాల్లో ఎయిడ్స్‌పై అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు వచ్చే నెల 12వ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు. రెండు నెలలపాటు హైరిస్క్ గ్రామాలు, కళాశాలలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మిషన్ ఎయిడ్స్ సురక్ష (MAS) కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను ప్రతి స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన అన్ని సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఎయిడ్స్ పరీక్షలు, కౌన్సెలింగ్, మందుల సరఫరాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ సేవలు అందించాలని స్పష్టం చేశారు. గర్భిణీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, వారికి అవసరమైన వైద్య సేవలను సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు
ఈ సమావేశంలో దిశా సిబ్బంది ఆనంద్, సిలార్, కౌన్సిలర్లు జయకుమార్, పుల్లయ్య నాయుడు, చంద్ర మోహన్, ఎన్‌జీవో ప్రతినిధులు అలావల్లి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News