నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 20 : మదనపల్లె మున్సిపాలిటీ 22వ వార్డులోని ప్యారానగర్ సచివాలయం ఎదుట ప్రజా మరుగుదొడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రదేశంలో సరైన డ్రైనేజీ సౌకర్యం, నీటి సరఫరా, మరుగుదొడ్ల వ్యర్థాలను సురక్షితంగా బయటకు పంపించే వ్యవస్థ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయా అనే విషయంలో తీవ్ర అనుమానాలు ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రజా మరుగుదొడ్లు భవిష్యత్తులో ప్రజారోగ్య సమస్యలకు కారణమయ్యే విధంగా నిర్మించకూడదు. అందువల్ల నిర్మాణానికి ముందు స్థల పరిశీలన, సాంకేతిక అనుమతులు, డ్రైనేజీ–వాటర్ సౌకర్యాలు, వ్యర్థాల నిర్వహణ విధానం వంటి అంశాలను అధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రజా ధనం విషయంలో పారదర్శకత కావాలి ఈ పనులకు సంబంధించిన అంచనాలు, పరిపాలనా అనుమతులు, సాంకేతిక అనుమతులు, బిల్లులు, కొలతల పుస్తకాలు మరియు పనుల నాణ్యతను పూర్తిగా పరిశీలించాలి. ప్రజా ధనం దుర్వినియోగం లేదా నిబంధనలకు విరుద్ధంగా బిల్లింగ్ జరిగిందనే అనుమానాలు ఉంటే, వాటిపై స్వతంత్రంగా పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి. ఈ వ్యవహారంలో సంబంధిత మున్సిపల్ కమిషనర్, టౌన్ ఇంజినీరింగ్ అధికారులు మరియు స్వచ్ఛ భారత్ విభాగానికి సంబంధించిన AE పాత్రపై కూడా ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా పరిశీలన చేయాలని కోరుతున్నాను. ఇప్పటికే ఫిర్యాదు చేసినా విచారణ జరగలేదు ఈ నిర్మాణ పనులను నిలిపివేసి పరిశీలించాలని కోరుతూ ఇప్పటికే ఫిర్యాదు నంబర్: ANMY20260708375 ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కలెక్టర్‌కు మా ప్రధాన డిమాండ్లు ప్యారానగర్ సచివాలయం ఎదుట జరుగుతున్న ప్రజా మరుగుదొడ్ల నిర్మాణంపై తక్షణమే స్థల పరిశీలన నిర్వహించాలి. నిర్మాణ ప్రదేశంలో నీరు, డ్రైనేజీ, వ్యర్థాల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయా లేదా పరిశీలించాలి. నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు, అంచనాలు, టెండర్/వర్క్ ఆర్డర్, కొలతలు మరియు బిల్లులను తనిఖీ చేయాలి. గతంలో ఇచ్చిన ANMY20260708375 ఫిర్యాదుపై తక్షణమే విచారణ చేపట్టాలి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నట్లు తేలితే పనులను వెంటనే నిలిపివేయాలి. ప్రజా ధనం దుర్వినియోగం జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చట్టపరమైన మరియు శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. విచారణ నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచి పారదర్శకతను కాపాడాలి. మా పోరాటం ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. ప్రజా ధనం సక్రమంగా వినియోగించబడాలి, ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలు మాత్రమే నిర్మించాలి, ప్రజారోగ్యానికి ఎలాంటి ముప్పు కలగకూడదనే ప్రజా ప్రయోజనంతో ఈ అంశాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువస్తున్నాము. జిల్లా కలెక్టర్ గారు ఈ అంశంపై తక్షణమే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరుతున్నాము
Reporter
Namitha News