నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లిలో జరుగుతున్న రాష్ట్ర జూనియర్ ఫుట్‌బాల్ బాలుర క్యాంప్‌ను సందర్శించిన రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి డానియల్ ప్రదీప్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాష్ట్ర జూనియర్ ఫుట్‌బాల్ బాలుర జట్టు శిక్షణా శిబిరం కొనసాగుతోంది. మదనపల్లె–పుంగనూరు రోడ్డులోని దీక్ష ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో ఈ క్యాంప్‌ను ఆగస్టు 10వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి డానియల్ ప్రదీప్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణా శిబిరాన్ని సందర్శించారు. క్రీడాకారులతో మాట్లాడి వారి శిక్షణ, వసతుల గురించి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కోఆర్డినేటర్ నీలాద్రి వెంకట కుమార్ అబ్జర్వర్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డానియల్ ప్రదీప్ మాట్లాడుతూ.. మదనపల్లికి రాష్ట్రంలోనే ప్రత్యేకమైన ఫుట్‌బాల్ చరిత్ర ఉందన్నారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో రాష్ట్ర జూనియర్ ఫుట్‌బాల్ జట్టు క్యాంప్ నిర్వహించడం అన్నమయ్య జిల్లాకు దక్కిన ప్రత్యేకతగా పేర్కొన్నారు. క్యాంప్‌లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు క్రమశిక్షణతో, పట్టుదలతో సాధన చేసి జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. రాష్ట్ర జట్టు క్రీడాకారులకు దీక్ష ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ యాజమాన్యం అందిస్తున్న వసతి, భోజన సౌకర్యాలపై డానియల్ ప్రదీప్ అభినందనలు తెలిపారు. క్యాంప్ నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తున్న పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దీక్ష పాఠశాల ఛైర్మన్ నాగమల్లి రెడ్డి, డైరెక్టర్ రామలింగారెడ్డి పాల్గొన్నారు. అలాగే అన్నమయ్య జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు చంద్రకళ, మహేంద్ర నాయక్, మహేంద్ర తదితరులు పాల్గొని రాష్ట్ర జట్టు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మదనపల్లిలో జరుగుతున్న ఈ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ క్యాంప్ ద్వారా యువ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ లభిస్తోందని, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించే ప్రతిభావంతులైన క్రీడాకారులు తయారవుతారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Reporter
Namitha News