నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గాలివీడు/రాయచోటి - సెప్టెంబర్ 06 : అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు కుడి కాలువకు ఆదివారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 15 రోజుల అనంతరం 80 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల కొనసాగించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రస్తుత నీటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పశువుల అవసరాలు, భూగర్భ జలమట్టం పెంపుదలకే నీటిని ప్రాధాన్యంగా వినియోగిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ప్రతి చెరువును గరిష్టంగా 30 శాతం వరకు మాత్రమే నింపుతారని, కనీస అవసరాలకు మించి నీటిని విడుదల చేయబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు 0.5 టీఎంసీల నీటిని అక్టోబర్ చివరి వరకు వినియోగించేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి తెలిపారు. అనంతరం హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి సుమారు 0.5 టీఎంసీల నీటిని వెలిగల్లు ప్రాజెక్టుకు తిరిగి భర్తీ చేసేలా జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు
పంటల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి* ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున నీటి లభ్యతపై రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రాజెక్టులోని నీటిని నమ్ముకుని అధిక నీటి అవసరమయ్యే పంటలు సాగు చేయవద్దని, ఆరుతడి పంటలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని రైతులను చేతులెత్తి కోరారు. "ప్రస్తుతం మనం నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం తాగునీటికి ఇబ్బందులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. వెలిగల్లు ప్రాజెక్టు నీటిని నమ్ముకుని పంటలు వేయవద్దు. ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయండి" అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.» ప్రజలకు తాగునీరు, పశువులకు నీరు అందించడమే ప్రస్తుతం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు. నీటి లభ్యతను బట్టి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు
*పంట నష్టంపై ఆందోళన వద్దు* ఇప్పటికే నీటి కొరత కారణంగా ఏవైనా పంటలు ఎండిపోయి నష్టపోయినట్లయితే, వాటికి క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా పరిహారం అందేలా జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ కాలువలు, చెరువుల ద్వారా దిగువ ప్రాంతాలకు అవసరమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. కాలువల నిర్వహణ, నీటి ప్రవాహం, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కడప ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ బాలచంద్రారెడ్డి, వెలిగల్లు ప్రాజెక్టు ఈఈ భరత్ కుమార్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News