నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భూముల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం గోపిశెట్టిపల్లె రైతుల కలెక్టరేట్ ముట్టడి “భూమాతను నమ్ముకొని బతుకుతున్నాం.. ప్రాణాలైనా అర్పిస్తాం గానీ భూములను మాత్రం వదులుకోలేం” అంటూ పుంగనూరు మండలం మేలుందొడ్డి పంచాయతీ గోపిశెట్టిపల్లె రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ జీవనాధారమైన సాగుభూములను భూసేకరణ పేరుతో తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి వచ్చిన మాజీ డీఎస్పీ, వాల్మీకి నాయకులు సుకుమార్ బాబు మాట్లాడుతూ గోపిశెట్టిపల్లెలో సుమారు 135 కుటుంబాలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ఒక్కో కుటుంబానికి ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు మాత్రమే సాగుభూమి ఉందన్నారు. 2023లో అప్పటి ప్రభుత్వం పెప్పర్ మోషన్స్ బస్సుల కంపెనీ ఏర్పాటుకు రైతుల భూములు సేకరించేందుకు ప్రయత్నించిందని, రైతుల నిరసనలతో అది నిలిచిపోయిందన్నారు. అనంతరం సాధారణ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోవడంతో రైతులంతా ఊపిరిపీల్చుకున్నామని చెప్పారు. అయితే ఇటీవల రెవెన్యూ అధికారులు భూసేకరణ నిమిత్తం గ్రామంలో సర్వే చేపట్టడంతో రైతుల్లో మళ్లీ ఆందోళన మొదలైందన్నారు. వెంటనే కలెక్టర్, సబ్ కలెక్టర్‌ను కలిసి తమ భూములను తీసుకోవద్దని, తమ కుటుంబాలను వీధిన పడేయొద్దని వేడుకున్నామని తెలిపారు. పరిశ్రమలు రావడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే పంటలు పండే సస్యశ్యామల భూముల్లో కాకుండా సమీపంలోని బీడు భూముల్లో కంపెనీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు శంకరప్ప, చిన్నపయ్య, మునియప్ప, వెంకటరమణ, ఆనంద్, వీరేంద్ర, భాస్కర్, లక్ష్మీదేవి, శంకరమ్మ, అలివేలమ్మ, శ్రీనివాసులు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News