నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : *పుంగనూరు లోAISF జిల్లా స్థాయి శిక్షణా తరగతుల కరపత్రాల విడుదల* అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని బసవరాజ పాఠశాల వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతుల కరపత్రాలను జిల్లా కార్యదర్శి కె. మాధవ్,రాష్ట్ర సమితి సభ్యులు మున్నా కలిసి విడుదల చేశారు. ఈ శిక్షణా తరగతులు జూన్ 6,7 తేదీలలో జరగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి ప్రతినిధులు, నాయకులు పాల్గొని విద్యారంగ సమస్యలు, నూతన విద్యావిధానం, విద్యా రంగ కార్పొరేటీకరణ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విద్యను కార్పొరేట్ శక్తుల ఆధీనంలోకి నెట్టే విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థుల్లో చైతన్యం కల్పించడమే శిక్షణా తరగతుల ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలో, రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, యువతను మత్తు పదార్థాల బారిన పడేస్తున్న పరిస్థితులపై కూడా ఈ శిక్షణా తరగతుల్లో విస్తృత చర్చ జరగనుందని తెలిపారు. సమాజంలో పెరుగుతున్న సామాజిక సమస్యలపై విద్యార్థి యువత చైతన్యవంతంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచి, శాస్త్రీయ దృక్పథంతో సమాజ నిర్మాణంలో భాగస్వాములను చేయడంలో AISF కీలక పాత్ర పోషిస్తుందని నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం, జిల్లాలో విద్యా వసతుల విస్తరణ కోసం AISF మరింత ఉద్యమాత్మకంగా పనిచేస్తుందని నాయకులు తెలిపారు. ఈ శిక్షణా తరగతులు భవిష్యత్ విద్యార్థి ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో AISF నాయకులు ప్రదీప్, నవీన్, సుహైల్ ,ప్రకాష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News