నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 13 : మదనపల్లి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తోపాటు.. మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ (FAC) చంద్రశేఖర్ రెడ్డి, జి ఎస్ డబ్ల్యూ ఎస్ లక్ష్మీపతి లు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ ల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అర్జీలను వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలని, గ్రీవెన్స్ పై ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీలను గడువులోపు అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు
మదనపల్లి మండలం రామిరెడ్డి లేఅవుట్ నీరుగెట్టిపల్లి ఏడవ క్రాస్ కి చెందిన బండ లక్ష్మీదేవి తన భర్త మరణించి దాదాపు రెండు సంవత్సరాలు అయిందని కుటుంబం గడవడానికి చాలా కష్టంగా ఉందని తమకు ఎలాంటి ఆధారము లేదని ప్రభుత్వం ద్వారా వితంతు పింఛను మంజూరు చేయాలని దరఖాస్తును సమర్పించారు. కురబలకోట మండలం తేట్టు గ్రామపంచాయతీ పరిధిలోని పూజారి వారి పల్లి కు చెందిన గుర్రాల వెంకటలక్ష్మి నా భర్త మరణించాడని, తర్వాత మా పిల్లలు కూడా మరణించారు. ఇద్దరు మనవళ్లు కలిసి జీవనం సాగిస్తున్నాము. నలుగురు సభ్యుల పేర్లపై కొత్త రేషన్ కార్డు మంజూరు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ కు విన్నవించుకున్నారు. నిమ్మనపల్లి మండలం వెంగలవారి పల్లెకు చెందిన కె.రమణ తనకు పక్షపాతం తో కాలు చేయి పడిపోయిందని ప్రభుత్వం ద్వారా వికలాంగ పింఛను మంజూరు చేయాలని దరఖాస్తును సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సమస్యలపై మొత్తంగా 392 అర్జీలను దరఖాస్తుదారులు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News