నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అన్నమయ్య జిల్లాలో నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు రెండు కీలక కేసులను ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులతో పాటు వరుస చోరీలకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ గజదొంగను అదుపులోకి తీసుకున్నారు.జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన దర్యాప్తులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్జిత్ చటియా, త్రిపురకు చెందిన అహలోటియన్ కైపింగ్‌ను సైబర్ క్రైమ్ కేసులో అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.2 లక్షల నగదు,57 చెక్కులు, వివిధ బ్యాంకులకు చెందిన పాస్‌బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.ఇదిలా ఉండగా, జిల్లాలోని రాయచోటి, చిన్నమండెం, గుర్రంకొండ, కలకడ పోలీస్‌స్టేషన్ పరిధుల్లో జరిగిన వరుస చోరీల కేసులను ఛేదించిన సీసీఎస్ పోలీసులు మోస్ట్ వాంటెడ్ నిందితుడు షేక్ ఖాజాపీర్‌ను అరెస్టు చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన అతడు జిల్లాలో సుమారు 50 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీఎస్ సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి 42 గ్రాముల బంగారు ఆభరణాలు,250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
Reporter
Namitha News