నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సమస్యలు పరిష్కరించే వరకు పోరు బాటే! - కలెక్టరేట్,సబ్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల భోజన విరామ నిరసన - డీఆర్వోకు ఉద్యోగుల వినతిపత్రం.. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరుబాట తప్పదని, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.ఎం.బాబ్జి అన్నారు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు రెవెన్యూ ఉద్యోగులు గురువారం జిల్లా కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఉద్యోగులతో కలసి,డీఆర్వో వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషనర్‌ను నియమించి, మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏ బకాయిలతో పాటు పీఆర్సీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ నాటి నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆరేళ్ల సర్వీస్ స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ హెచ్‌ఆర్‌ఎంఎస్ పాలసీ అమలు చేయాలని కోరారు. ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయడంతో పాటు ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ (ఈహెచ్‌ఎస్)ను సమగ్రంగా వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే జేఏసీ కార్యాచరణ మేరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఫోటోలు ఉన్నాయి
Reporter
Namitha News