నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లిలో అర్హులైన చేనేత కార్మికులకు ‘నేతన్న సేవ’ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చేనేత కార్మికుల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి, అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ప్రభుత్వం అందిస్తున్న ‘నేతన్న సేవ’ పథకం ద్వారా రూ.25 వేల ఆర్థిక సహాయం అందించాలని చేనేత కార్మికుల ప్రతినిధి వీరభాస్కర్ కోరారు. సొంత మగ్గాలు ఏర్పాటు చేసుకుని చేనేత వృత్తిని కొనసాగిస్తున్న కార్మికులతో పాటు, కూలి మగ్గాలపై పనిచేస్తున్న వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వర్క్‌షెడ్లు కలిగి ఉండి చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన కార్మికులను కూడా పథకంలో చేర్చాలని కోరారు. ఆగస్టు 7న నిర్వహించిన చేనేత దినోత్సవం సందర్భంగా కొంతమంది అర్హులైన చేనేత కార్మికులకు రూ.25 వేల ఆర్థిక సహాయం అందించినప్పటికీ, ఇంకా అనేకమంది అర్హులకు పథకం అందలేదని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే చేనేత కార్మికులు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారని... అనంతరం ఆగస్టు 20వ తేదీన పథకం అమలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని చెప్పారు. అయితే గడువు దాటిపోయినా ఇప్పటివరకు అర్హులైన పలువురు కార్మికులకు ఆర్థిక సహాయం అందలేదని పేర్కొన్నారు. కాబట్టి ఉన్నతాధికారులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలని కోరారు. నిజంగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన కార్మికులను గుర్తించి, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ‘నేతన్న సేవ’ పథకం ద్వారా రూ.25 వేల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని వీరభాస్కర్ విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల సమస్యను అధికారులు సత్వరమే పరిష్కరించి, అర్హులందరికీ ప్రభుత్వ పథకం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Reporter
Namitha News