నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి, జూలై 22: అన్నమయ్య జిల్లా, మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మరియు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు లు సోమవారం ఆర్డీవో కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర డిజిపి మాట్లాడుతూ.... అగ్ని ప్రమాదం జరిగిన ఆర్డీవో కార్యాలయాన్ని పరిశీలించామని, ఈ అగ్గి ప్రమాదం ఆర్డీవో కార్యాలయంలో 22 (ఏ) కి సంబంధించిన విభాగంలో జరిగిందని తెలిపారు. ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులు ఆదివారం రాత్రి ఎందుకు పని చేస్తున్నారు, అగ్ని ప్రమాదం జరిగిన చోట దొరికిన అగ్గిపుల్లలు, వంటి విషయాలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉందని, దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆర్డీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగిందని, ఆర్డీవో కార్యాలయంలోని 22 (ఏ) వంటి పలు సబ్జెక్టులు చూసే విభాగంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంపై అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా ఏఎస్పి రాజ్ కమల్, డిఆర్ఓ సత్యనారాయణరావు, మదనపల్లి ఆర్డిఓ హరిప్రసాద్, రాయచోటి ఆర్డీవో రంగస్వామి, రాజంపేట ఆర్డిఓ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News