నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె :- మదనపల్లె మండలం, బసినికొండ పంచాయతీలోని గంగన్నగారిపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణ చైతన్య కాలేజీలో పాత మేనేజ్‌మెంట్ సభ్యులు తీవ్ర ఆగడాలు చేస్తూ విద్యార్థులకు ఇక్కట్లు తెచ్చిపెడుతున్నారని ప్రస్తుత మేనేజ్‌మెంట్ సభ్యులైన కృష్ణారెడ్డి, శశివర్ధన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డిలు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక కృష్ణ చైతన్య కాలేజ్ నందు వారి ఆగడాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2003లో వాగ్దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసి 2004లో శ్రీకృష్ణ చైతన్య నర్సింగ్ కాలేజ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అప్పట్లో తమతో పాటు బంధువులైన గోపాల్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మల్లికార్జున్రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి తదితరులు సభ్యులుగా ఉండేవారని, అయితే తాను ఉద్యోగ రీత్యా వివిధ ప్రదేశాలలో పనిచేస్తుండడంతో కళాశాలను వారి అధీనంలోకి తీసుకొని ఎన్నో ఆగడాలకు పాల్పడ్డారన్నారు. దీంతో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి వారిని సొసైటీ నుంచి తొలగిస్తున్నట్లు సమావేశంలో తీర్మానం జరిగిందన్నారు. అయితే 2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలో రావడంతో వారు రాజకీయ నాయకుల అండదండలతో అనధికారికంగా, రౌడీయిజంతో తమను కళాశాలలోనికి రానివ్వకుండా కళాశాలను ఆక్రమించుకుని రూ. 60 కోట్ల మేర దోపిడీకి పాల్పడ్డారన్నారు. తదనంతరం కూటమి ప్రభుత్వం రాగానే తమ వద్ద ఉన్న ఆధారాలతో అధికారులను, కోర్టును ఆశ్రయించి, కోర్టు తీర్పు మేరకు ప్రస్తుతం శ్యామలమ్మ ప్రెసిడెంట్ గా కృష్ణారెడ్డి లీగల్ అడ్వైజర్ గా, శశివర్ధన్ రెడ్డి కరస్పాండెంట్ గా, గోవర్ధన్ రెడ్డి కోశాధికారిగా కళాశాలను తమ అధీనంలోకి తీసుకుని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో పాత మేనేజ్‌మెంట్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గ్రహించి జాగ్రత్త పడాలన్నారు. అయినా గత ప్రభుత్వంలోని అధికారుల పలుకుబడితో, రాజకీయ పలుకుబడితో, డబ్బు అహంకారంతో పాత మేనేజ్‌మెంట్ సభ్యులు ఇప్పటికి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీనికి తోడు విద్యార్థుల సర్టిఫికెట్లను దొంగలించి వాటితో వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. సర్టిఫికేట్స్ అవసరమైన విద్యార్థుల నుంచి ముక్కు పిండి వేలల్లో డబ్బులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారన్నారు. దీనివల్ల కొంతమంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తాము ఇదివరకే సబ్ కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లమన్నారు. ఆయన సూచనమేరకు ఆర్బిటరేషన్ కు దరఖాస్తు చేశామన్నారు. కావున ఉన్నతాధికారులు స్పందించి పాత మేనేజ్మెంట్ ఆగడాల నుంచి విద్యార్థులకు, కాలేజీకి రక్షణ కల్పించాలని కోరారు. అదేవిధంగా కళాశాలలో కొత్త మేనేజ్‌మెంట్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని, అర్హులైన పేద విద్యార్థులకు నర్సింగ్, బి ఫార్మసీ లో ఉచిత సీట్లు కల్పిస్తామని తెలియజేశారు
Admin
Namitha News