నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అజ్ఞాతంలోకి బంగారు నగల వ్యాపారి -- నగల తయారీ పేరుతో లక్షల్లో వసూలు -- లబోదిబో మంటున్న బాధితులు -- పోలీస్ స్టేషన్ కు పరుగులు గత కొన్నేళ్లుగా నమ్మకంగా నగల వ్యాపారం నిర్వహిస్తూ ఆభరణాలు తయారు చేస్తూ కస్టమర్లకు నమ్మకాన్ని కలిగించిన ఓ నగల వ్యాపారి పెద్ద మొత్తంలో నగదు, నగలు వసూలు చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గత పది రోజులుగా షాపు మూసేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ సోమవారం పోలీస్ స్టేషన్ కు పరుగులు పెట్టారు. ఈ మేరకు స్థానిక ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె పట్టణం, స్థానిక సిపాయి వీధికి చెందిన కె సురేష్ కుమార్ అనే వ్యక్తి శ్రీ సాయి సురేష్ జ్యువెలర్స్ పేరుతో స్థానికంగా జ్యువెలరీ షాప్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో బంగారు ఆభరణాలు విక్రయించటం తో పాటు ఆర్డర్ ప్రకారం ఆభరణాలు తయారు చేయించి ఇచ్చేవాడు. ఇతనితోపాటు అన్న నాని, తండ్రి నారాయణ ఆచారి పనిచేసేవారు కాగా ఇతనికి మదనపల్లె మండలం బొమ్మనచెరువు కు చెందిన మహేష్ రూ. 3,40,000 చెల్లించి ఆభరణాలు ఆర్డర్ ఇచ్చాడు. అదేవిధంగా రెడ్డి ప్రసాద్ అనే అతను 150 గ్రాముల పాత బంగారు, రూ. 15,00,000 నగదు ఇచ్చి ఆభరణాలు చేయించమని ఆర్డర్ ఇచ్చాడు. పట్టణానికి చెందిన రవిచంద్ర రూ. 3,00,000, రవితేజ రూ.8 లక్షలు ఇచ్చారు. ఇలా పలువురి వద్ద నగలు ఆర్డర్ తీసుకున్న సురేష్ కుమార్ లక్షల్లో వసూలు చేసి కుటుంబ సభ్యులతో సహా గత పది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. షాపు తెరవకపోవడం, ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఏమి చేయాలో పాలుపోని బాధితులు మోసపోయామేమోనని భావించి సోమవారం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు పరుగులు పెట్టారు. జరిగిన మోసం, అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేస్తామని తెలిపారు. అయితే సురేష్ కుమార్ వీరి వద్దనే కాకుండా పలువురి వద్ద నగలు, నగదు తీసుకుని ఉడాయించాడని, సుమారు రూ. 20 కోట్లకు పైగానే కోర్టులో ఐపి దాఖలు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. అయితే పోలీసులు బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తారు వేచి చూడాల్సి ఉంది.
Reporter
Namitha News