నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - అక్టోబర్ 23 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో నకిలీ మద్యం కేసుతో తెలుగుదేశం పార్టీకి మకిలి సోకిందని మీరు జోక్యం చేసుకొని తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి జీవం పోయాలని టిడిపి నాయకులు ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు మొరపెట్టుకున్నారు. గురువారం మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, సీనియర్ నాయకుడు వెంకట్ రెడ్డి లో ఆధ్వర్యంలో టిడిపి నాయకులు ఎమ్మెల్సీ శ్రీకాంత్ ను కలసి పార్టీ స్థితిగతులపై వివరించారు. పార్టీ అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి గౌరవం లేదని నాడు వైకాపా అరాచక పాలనలో కేసులు, అరెస్టులు, దాడులు భరించినా నేటికీ ఆ గాయాలు మానలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పార్టీకి పూర్తిస్థాయిలో కష్టపడి కష్టనష్టాలకు నిలబడి సేవ చేసిన నాయకులకు గౌరవం లేకపోగా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో కానరాని అవకాశవాద నాయకుల తో పార్టీ సిద్ధాంతాలు అటకెక్కి పక్కదారి పట్టినట్లు చెప్పారు. ఇప్పటికైనా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్న నిజమైన నాయకులకు, కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గం పార్టీకి కంచుకోటని పార్టీఅధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తంబళ్లపల్లె నియోజకవర్గం లో ప్రక్షాళన జరుగుతుందని అక్కడి నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే నాయకుడిని నియమించి తెలుగుదేశం పార్టీ కి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Reporter
Namitha News