నమిత న్యూస్ - Andhra Pradesh / YSRkadapa : *కడప జిల్లా.....* ఏప్రిల్ 22న ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు ఏప్రిల్ 16 నుండి 26 వరకు బ్రహ్మోత్సవాలు, 17న శ్రీరామ నవమి పర్వదినం ఎన్నికల కోడ్ అమలు పక్కాగా పాటించాలి ఒంటిమిట్ట, మార్చి 25 : ఎన్నికల కోడ్ అమలు పక్కాగా పాటిస్తూ.. ఒంటిమిట్ట శ్రీ సీతా సమేత కోదండరామ బ్రాహామోత్సవాలు, కల్యాణ మహోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక టిటిడి కళ్యాణ మండపం సమీపంలోని పరిపాలన భవనం సమావేశపు హాలులో... టీటీడీ జేఈవో వి.వీరబ్రహ్మం, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జేసి గణేష్ కుమార్, టీటీడీ జెఈఓ వీరబ్రహ్మం, కడప నగర కమీషనర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ లతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. ** ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఏప్రిల్ 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ప్రధానంగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో.. ఎక్కడా కూడా మోడల్ కోడ్ ఉల్లంఘన జరగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అదేశలు జారీ చేశారు. ఈ విషయంలో టిటిడి అధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా ఎప్రిల్ 22వ తేదీన జరిగే సీతారాములవారి కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ తదితర ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున.. భారీ భక్తజన సందోహం రవచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఆ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిల్లా యంత్రాంగం, టీటీడీ, పోలీస్ అధికారులు సంయుక్తంగా, నిర్దిష్ట ప్రణాళికలతో విధులను నిర్వర్తించాలన్నారు. రాములవారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు కళ్యాణవేదిక ముందు ఏర్పాటు చేసిన ఒక్కో గ్యాలరీకి ఒకరిని ఇంఛార్జిగా నియమిస్తామన్నారు. ప్రసాదాల కౌంటర్ల వద్ద ఎక్కడా కూడా జనం తొక్కిసలాట జరుగకుండా అధికారులు, పోలీస్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలని టిటిడి జేఈవో కు తెలిపారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక, కనీస వసతులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీరు, భక్తులకు అన్నప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు ఏర్పాటు, కంట్రోల్ రూం ఏర్పాటు, సీసీ కెమెరాలు, విద్యుత్, అగ్నిమాపక వాహనాలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, 108 వాహనాలు, మెడికల్ డిపార్ట్మెంట్ నుండి స్పెషలిస్ట్ డాక్టర్లతో పాటు.. అత్యవసర మందులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, తాత్కాలిక మెడికల్ క్యాంపులు, అక్కడక్కడ హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు మొదలైన అన్ని అంశాలను ఎలాంటి కొరత లేకుండా.. ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 22వ తేదీన సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 సమయంలో కల్యాణోత్సవం చేస్తున్నందున విద్యుత్ దీపాలంకరణతో పాటు.. అత్యంత పటిష్ట భద్రతా చర్యలను కూడా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుదీకరణ, తోరణాలు, పుష్పాలంకరణ, స్వాగత ఆర్చిలు, ఎల్‌ఇడి బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా.. ఎక్కడా కూడా రాజకీయ నాయకుల ఫోటోలు బ్యానర్లు, కటౌట్లపై కనిపించకుండా చర్యలు చేపట్టాలన్నారు. ** జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ మాట్లాడుతూ.. టిటిడి అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమిష్టి కృషి చేసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించకుండా విధులు నిర్వహించడంతో పాటు.. కోడ్ ఉల్లంఘన ఎక్కడ జరగకుండా చర్యకు తీసుకుంటామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్యాలరీ వద్ద గట్టి భద్రతా చర్యలు చేపడతామన్నారు. గతంలో నిర్వహించిన శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాల అనుభవాలను గుర్తుంచుకొని.. ఎక్కడా, ఎలాంటి చిన్న పొరపాటుకు కూడా అవకాశం లేకుండా.. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు టిటిడి విజిలెన్స్& సెక్యూరిటీ అధికారులు సంపూర్ణ సహకారాలు నదించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తితిదే అధికారులు, జిల్లా అధికారులతో కలిసి.. కల్యాణ వేదిక, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ** *బ్రహ్మోత్సవ కార్యక్రమాల వివరాలు..* * *ఏప్రిల్ 16న సాయంత్రం - అంకురార్పణ* * *17వ తేదీన ఉదయం - ధ్వజారోహణం(మీథున లగ్నం) సాయంత్రం - శేష వాహన సేవ* * *18న ఉదయం - వేణుగానాలంకారము, సాయంత్రం - హంస వాహన సేవ* * *19న ఉదయం - వటపత్రశాయి అలంకారము, సాయంత్రం - సింహ వాహన సేవ* * *20న ఉదయం - నవనీత కృష్ణాలంకారము, సాయంత్రం - హనుమత్సేవ* * *21న ఉదయం - మోహినీ అలంకారము, సాయంత్రం - గరుడసేవ* * *22న ఉదయం - శివధనుర్భంగాలంకారము, సాయంత్రం - కళ్యాణోత్సవము(సా.6.30- రా.8.30)/ గజవాహనము* * *23న ఉదయం - రథోత్సవం* * *24న ఉదయం - కాళీయమర్ధనాలంకారము, సాయంత్రం - అశ్వవాహన సేవ* * *25న ఉదయం - చక్రస్నానం, సాయంత్రం - ధ్వజావరోహణం.* 26న సాయంత్రం - పుష్పయాగం. ఈ కార్యక్రమంలో డిఆర్వో గంగాధర్ గౌడ్, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాసులు, వెంకట రమణ, వెంకటేశ్వర్లు, సివిఎస్ఓ నరసింహ కిషోర్, ఎస్వీబిసి సిఈవో షణ్ముఖ కుమార్, సిఇ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవోల నటేష్ బాబు, కడప డీఎస్పీ షరీఫ్, వ్యవసాయ శాఖ జేడి నాగేశ్వరరావు, ఏపీఎంఐపి పీడి రవీంద్రారెడ్డి, ఉద్యాన శాఖ డీడీ రాజీవ్ మైఖేల్, సమగ్ర శిక్ష ఏపిసి ప్రభాకర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.నాగరాజు, డిఆర్డీఏ, మెప్మా పిడీలు ఆనంద్ నాయక్, సురేష్ రెడ్డి, డీపీఓ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ సీఈవో సుధాకర్ రెడ్డి, ఏపీఎస్పీడిసిఎల్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు రమణ, వీరన్న, ఆర్టీవో, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు...
Admin
Namitha News