నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 17 : జిల్లా పోలీసు కార్యాలయం : ఒమన్ కష్టాల నుంచి సురక్షితంగా స్వస్థలానికి చేరిన హసనపురం షహీన(30) పిల్లల వినతి పై జిల్లా ఎస్పీ గారు స్పందించి సంబంధిత ఏజెంట్ తో మాట్లాడి కేవలం 24 గంటల్లోనే బాధితురాలిని స్వదేశానికి రప్పించేలా చర్యలు చేపట్టారు. బతుకుదెరువు కోసం ఒమన్ వెళ్లి చిత్ర హింసలకు గురవుతున్న హసనాపురం షహీన కన్నబిడ్డల వేడుకోలుతో పోలీసుల సాయంతో మోక్షం లభించింది. తల్లి పడుతున్న మనోవేదనను తట్టుకోలేని బాధితురాలి ఇద్దరు పిల్లలు జిల్లా పోలీసు కార్యాలయంలో 10 న "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక" లో జిల్లా ఎస్పీ గారిని వేడుకున్నారు. వారి వినతి పై తక్షణం స్పందించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపిఎస్ గారు ఒమన్ లో ఇబ్బందులు పడుతున్న బాధితురాలిని స్వదేశానికి రప్పించేందుకు విశేషంగా కృషి చేశారు. ఫిర్యాదు అందిన కేవలం 24 గంటల్లోనే బాధితురాలిని స్వదేశానికి రప్పించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్పీ గారు తన సిబ్బందితో చేసిన ప్రయత్నాలు ఫలించడంతో సెప్టెంబర్ 11 న ఒమన్ నుండి బయలుదేరి 12 న బుధవారం షహీన సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం, పెద్దూరు గ్రామానికి చెందిన షహీన తన కుటుంబాన్ని పోషించేందుకు ఈ ఏడాది ఆగస్టు 25 న హైదరాబాద్ నుండి ఒమన్ కు బయలుదేరి 26 న ఒమన్ దేశానికి చేరింది.
బిడ్డలు ఇద్దరినీ ఇంటి వద్దనే వదిలి తనవంతుగా కుటుంబానికి అండగా నిలిచేందుకు ఒమన్ దేశం వెళ్లింది. ఏజెంట్ మోసపూరిత వీసా తీయడం తో ఒమన్ దేశంలో తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఒమన్ వారు తనను కొట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమై వీడియో ద్వారా బోరున విలపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో అందరి హృదయాలను కలిచివేసేలా వైరల్ అయ్యింది. అంతేకాకుండా ఆమె ఇద్దరు పిల్లలు జిల్లా ఎస్పీగారిని కలిసి తల్లి పడుతున్న బాధను విన్నవించు కున్నారు. తీవ్ర కష్టాలలో ఉన్న మా తల్లిని రక్షించి మా ఇంటికి రప్పించేలా చూడాలని వేడుకున్నారు. దీంతో ఎస్పీ గారు స్పందించి ఆమెను ఒమన్ దేశానికి పంపిన ఏజెంట్ను పిలిపించి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఏజెంట్ ద్వారా కష్టాలలో ఉన్న షహీన ను ఇండియాకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు హసనపురం షహీన సురక్షితంగా స్వగ్రామానికి చేరడంతో హసనపురం షహీన కుటుంబీకులు ఆనందంతో జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం పోలీస్ శాఖకు రుణపడి ఉంటామన్నారు. జిల్లా ఎస్పీ గారు తక్షణమే స్పందించి కేవలం 24 గంటల్లోనే స్వదేశానికి బయలుదేరేలా తీసుకున్న చర్యల పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Reporter
Namitha News