నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 13 ః తమ బిడ్డ బాగా చదువుకొని అవసాన దశలో పోషిస్తాడనుకున్న కన్నబిడ్డ ప్రయోజకుడై సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సంపాదిస్తూ ఆన్లైన్ బెట్టింగ్ తన పాలిట శాపమై అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన తంబళ్లపల్లె మండలం ఎద్దుల వారి పల్లి పంచాయతీ దిగువ గాలిగుట్టపల్లె లో వెలుగు చూసింది. కదిరి రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ భాష, స్థానికుల వివరాల మేరకు తంబళ్లపల్లె మండలం ఎద్దుల వారి పల్లి పంచాయతీ దిగువ గాలిగుట్టపల్లె గ్రామానికి చెందిన నడిమింటి వెంకటరమణారెడ్డి కుమారుడు పద్మనాభ రెడ్డి (27) చిన్న వయసు నుండి విద్యలో అగ్రగామిగా రాణించి తల్లిదండ్రుల ఆశయానికి అనుగుణంగా బెంగళూరులో ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జీతానికి కుదిరాడు. తల్లిదండ్రులు సైతం తమ బిడ్డ ఉన్నత స్థాయికి ఎదుగుతాడని తమను పోషిస్తాడని గంపడాశతో సంతోషపడ్డారు. అయితే తాము ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలచినట్లు పద్మనాభ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కొనసాగుతూ ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. ఈ బెట్టింగ్ లతో సుమారు 24 లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పు చెల్లించే మార్గం కానరాక ఇంట్లో చెప్పలేక తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఈ మానసిక ఒత్తిడికి తట్టుకోలేక జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై మదనపల్లి మండలం సిటిఎం సమీపంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. అర్ధరాత్రి నేను ఆన్లైన్ బెట్టింగు ఆడి లక్షలు పోగొట్టుకున్నాను. నాలాగా ఎవరూ ఆన్ లైన్ గేమ్ లు ఆడొద్దని అప్పులు తీర్చలేక తల్లిదండ్రులకు గర్భశోకం మిగల్చవద్దని నేటి సాఫ్ట్ వేర్ యువతకు సందేశం ఇస్తూ సూసైడ్ నోట్ జేబులో పెట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చి గ్రామం సమీపంలోని రెడ్డివారి పల్లి వద్ద తిరుపతి నుండి మదనపల్లె వైపు వెళుతున్న రైలు కిందపడి బలవన్మరణం చెందాడు. శనివారం ఉదయం అటుగా వెళుతున్న స్థానికులు కనుగొని సిటిఎం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కదిరి రైల్వే పోలీస్ కానిస్టేబుల్ భాష ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. తొలిత రైలు పట్టాలపై ఎవరో కొట్టి చంపి పడేసినట్లు అనుమానించిన పోలీసులు సంఘటన స్థలంలో మృతుని సెల్ ఫోన్, లాప్ టాప్,ఆధార్ కార్డు, బెంగళూరులో పని చేస్తున్న కంపెనీ ఐడి కార్డ్ లను పరిశీలించి ఆత్మహత్యగా గుర్తించి మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారుని మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చేతికి అంది వచ్చిన కుమారుడు ఇకలేడని తెలిసి అప్పు విషయం ఒక మాట కూడా చెప్పలేదు కదా నాయనా ఇక మాకు దిక్కెవరు బిడ్డా అంటూ బోరున విలపించడం చూపరుల హృదయాలను తీవ్రంగా కలిసి వేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పద్మనాభ రెడ్డి మృతి విషయం తెలిసిన దిగువ గాలి గుట్ట పల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Admin
Namitha News